గోకులంలో సంబరాలు

గోపాలుని లీలా విన్యాసం క్రిష్ణాష్టమి ఆనందం
మహామాయావి మంత్రం ఆకలినిద్రా మాయం
ఒకరాత్రి దేవకీ వసుదేవుల పుత్రుడై పుట్టాడు
అదేరాత్రి యశోదానందుల పుత్రుడై దొరికాడు
 
నల్లని జడలో నవ్వుల జాజులు
చిరు సవ్వడి మెట్టెల మువ్వలు
రెండో ఝామున రేయి మత్తులు
వెన్నుని వెదికే రెక్కల సొగసులు
మొగలి పొద వైపు నాగ కన్యల ఉరుకులు
 
కృష్ణచంద్రుని చూస్తూ కన్నార్పని కలువలు
మన్మధ బాణాలను కురిపించే గోపకాంతలు
గొల్ల పల్లె లేమలు భామలు గోప వనితలు
వయ్యారి వాలుచూపుల కౌగిలించె ఓ గొల్లెత
 
మాటిమాటికీ ముంగురుల సర్దేనొక సఖియ
కోపనటనతొ తనవెనకే త్రిప్పుకుందట ఉత్పల
కన్నీరుతో కాళ్ళకు బంధంవేసిన ప్రియంవద
తుంటరి శైశవ క్రీడల మురిసింది కమలిని
చూపులభాణాలు వేసి చుట్టుకుంది ఆనందిని
 
చీరచెంగును వేలితో ముడి వేసింది మేధిని
తన చేతిని తనే నలుపుకుంది ఒక మానిని
వీనులకింపుగ కీర్తించె ముగ్ధమగువ సురభి
సిరిని గూడిన శ్రీహరి నర్చించిన విష్ణుప్రియ
 
హరి కోసం అడుగులు తడబడిన దీపకళిక
చిత్త చోరునితొ చీరల దొంగతొ వాసవదత్త
గోపాంగనల నల్లనయ్యపై గోపతరుణుల మనసులు
గోకులం గోపయ్యపై మోహావేశితలు గోపసుందరులు
 
అల్లరి కిట్టయ్య పక్కనేనట గొల్లపల్లె గొల్లపడుచులు
కోతి చేష్టలను నిందిస్తూ కొంటె అపరంజి బొమ్మలు
మోము చుట్టు చేతులు తిప్పిన తరళ
కణతలపై మెటికలు విరిచిన చంపక
 
వేవేల కొలనుల కనిపించే ఒకే సూరీడు
వేవేల భామల కౌగిట్లో గోపీ వల్లభుడు
వెన్నెల స్నానాల ఉట్టి కొట్టుళ్ళు
సేవాస్ఫూర్తి రక్తిన శక్తి క్రీడలు
 
మురళీ రవళి చెప్పిన కబుర్లు
చెక్కభజనల చలాకి పరుగులు
వెదురువంశిని చేతబూనిన మోహనవంశీధరుడు
చందనంలా చల్లనివాడు పరంజ్యోతి స్వరూపుడు
 
ఎన్ని కదలు చెప్పుకున్నా కరువు తీరదు
ఎన్ని పాటలు పాడుకున్నా తనివి తీరదు
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments